My friend

Thursday, February 3, 2011

మార్పు సాధ్యమే

అవినీతి, కుళ్ళిన రాజకీయాలు, ఎన్నికల్లో ధనప్రవాహం.... ఇలా చెప్పుకుంటూ పోతే సమాజాన్ని పీడిస్తున్న సమస్యలెన్నో. ఒక్కోసారి వీటన్నిటిని కడిగి పారెయ్యాలి అని అనిపిస్తున్నది. ఏదో ఒక సందర్బంలో ప్రతి ఒక్కరు యీ ఆలోచన చేసే ఉంటారు. ఆ వెంటనే ఒక సందేహం పట్టుకుంటుంది. మన ఒక్కరితో యీ సమాజం మారుతుందా? మనం మరుతామన్నా పక్కన ఉన్నవారు మారనిస్తారా ? మన కొత్త పోకడ చూసి నవ్వుకుంటారేమో.... ఇలా ప్రయత్నం ప్రారంభం అవకముందే సవాలక్ష సందేహాలు చుట్టుముడుతుంటాయి. మన సందేహాలే కాదు. మన చుట్టూ ఉన్న పరిస్తితులను చూస్తె ఎవరికైనా అవే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ ఒక్కసారి చరిత్ర గమనాన్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది. మన సందేహాలు అర్ధంలేనివని. సామ్రాజ్యవాదానికి మన పూర్వికులే చరమగీతం పాడారు. రాచరికం కూడా అంతం అయినట్లే. కొన్నిదేశాలలో ఇంకా దాని ఛాయలు కనిపిస్తున్నా కాలం చెల్లింది. ఇక యిప్పుడు మన కళ్ళముందు కనిపిస్తున్న ఈజిప్ట్, ట్యునీషియ, మద్య ప్రాచ్యం దేశాలే సజీవ సాక్ష్యం.... మార్పు సాధ్యమే, అనివార్యమే అని చెప్పడానికి. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబుకింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సహనం నశించింది. ప్రజలంతా ఒక్కటయ్యారు. వారి చైతన్యం ఒక చారిత్రిక సన్నివేశానికి దారి తీస్తోంది. తెలంగాణాలోను ప్రత్యెక రాష్ట్రం కోసం ఇలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. సుదీర్గ సమరంలోను ప్రజలు అలసిపోకుండా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. యీ పరిస్తితి చూసాకైనా మనలో మార్పు రాదా. ఎవరికోసమో ఎదురుచూడాల్సిన అవసరం ఉందా? పరిస్థితులను నిందించాల్సిన అవసరం ఉందా? ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఆచరణ అంత తొందరగా జరగదు అన్నది వాస్తవం. కానీ ముందుగ మనలోని నెగటివ్ ఆలోచన తీరును మార్చుకోవలసిన అవసరం ఉంది. మనవంతుగా మార్పును ప్రారంబిస్తే అదే తొలి అడుగు కావచ్చు . రేపు మనమే నూతన సమాజానికి సంస్కర్తలం కావచ్చు. అంతగా మనపై మనకు నమ్మకం లేకపోతే... ఎవరి నాయకత్వానో నడిచి అవినీతిలేని సమాజాన్ని, అందరు కలలుగనే ప్రపంచాన్ని మన కళ్ళముందు నిర్మించుకోవచ్చు. కావలిసినధల్ల ఒక్కటే..... సంకల్పం. యింత చెప్పిన నేను మారతాన అంటే మారేందుకు ప్రయత్నిస్తాను అని చెబుతాను. ఎందుకంటె నేను ఈ వ్యాసం రాసుకున్నందుకయినా కట్టుబడి ఉండాలి కదా. నా ప్రయత్నం పలిస్తుందనే అనుకుంటాను.

No comments: