My friend

Saturday, February 12, 2011

ప్రేమ - స్నేహం - ఆకర్షణ


ప్రేమ.... ఓ మధురానుభూతి. మనసుకు తప్ప ఊహకు అందనిది. ప్రేమ గురుంచి ఎవరినడిగినా దాదాపుగా వచ్చే సమాదానం ఇదే. కానీ ప్రేమకు స్టాండర్డ్ నిర్వచనం అంటూ ఏమీ లేదు. ఎవరు ఎలా నిర్వచించుకుంటే అదే ప్రేమ. కానీ దానికంటూ ఓ లక్షణం ఉంటుంది. ఓ తల్లికి బిడ్డకి ఉండే అనుబంధం, ఓ అన్నకి చెల్లికి ఉండే అనురాగం, ఓ ఇద్దరు మిత్రులకు మధ్య ఉండే అవినాభావ సంబంధాల మధ్య ఈ ప్రేమ చిగురిస్తుంది. ఒకరి పై ఒకరికి ఉండే అనురాగం, ఆప్యాయతనే ఒకరకంగా ప్రేమ అని చెప్పవచ్చేమో. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఆత్మీయ సంబంధం. రెండు మనసులకు సంబంధించిందే తప్ప బౌతిక పరమైనది ఎంత మాత్రం కాదు అనే విషయం సుస్పష్టం.

ఇంతకి ప్రేమ గురంచి నిర్వచనాలు అవసరమా? అనే సందేహం రావచ్చు. ఇది సహజమే. నిజానికి ఏ సంబందానికీ నిర్వచనం అవసరం లేదు. కానీ ఈ సంబంధం ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకున్నప్పుడు దానికంటూ నిర్దిష్ట లక్షణాలను గుర్తించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ చర్చ అంతా ఎందుకంటే..... ప్రేమకి నానా అర్థాలు చెప్పుకుంటున్న పరిస్థితి నేడు కనిపిస్తుంది. పేరెంట్స్ ప్రేమ వేరు, యువతీ యువకుల ప్రేమ వేరు అనే వాదన వినిపిస్తుంది. యువతీ యువకుల మధ్య ప్రేమ అంటే అది ఒక ప్రత్యేక సంబంధం అనే అర్థంలో చెప్పుకుంటున్నారు. వారూ అలాగే వ్యవహరిస్తున్నారు. సమాజంలో ప్రేమ అంటే నేరంగా పరిగనిస్తున్న సందర్భాలూ ఉన్నాయీ. ఇంతకి ఇదంతా ఎందుకు మొదలయింది.... అని ఆలోచిస్తే ఏది ప్రేమ అనే విషయంపై స్పష్టత లేకపోవడం వల్లే.

ప్రేమ ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. తల్లి బిడ్డల మధ్య , స్నేహితులకు మధ్య.... విశ్వంలో ఎక్కడ ఉన్నా దానికంటూ ఓ స్వభావం ఉంటుంది. కానీ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, స్త్రీ, పురుషుల ప్రేమ అంటూ దానికి వర్గీకరణలు ఏమీ ఉండవు. ఈ విషయం పై స్పష్టత ఉంటే ఇప్పుడు సమాజంలో ఉన్న అపోహలు, సమస్యలు ఉండవు. ప్రస్తుతం ఉన్న గొడవ అంతా యువతీ యువకుల మధ్య ప్రేమ గురించే. అసలు ప్రేమికులం అని చెప్పుకునే వారంతా నిజమైన ప్రేమికులేనా...? వారి మధ్య ఉన్న ప్రేమలో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయం గమనించాల్సి ఉంటుంది. సహజంగా ఒక వ్యక్తిపై ప్రేమ ఉంటే... ఎల్లప్పుడు వారి క్షేమమే కోరుకుంటుంది. స్వార్థానికి చోటే లేదు. ఎంత దూరంలో ఉన్నా వారి మనసులు దగ్గరగానే ఉంటాయి. ప్రదాన విషయం ఏమిటంటే.... ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నాను అని చెప్పాల్సిన అవసరమే రాదు. తల్లి బిడ్డల మధ్య, స్నేహితుల మధ్య సంబంధమే ఇందుకు నిదర్శనం.
నేటి తరం ప్రేమికులుగా చెప్పుకునే యువతీ యువకుల మధ్య ఉంటున్న సంబంధం ఏమిటి. ఒక్క క్షణం దూరమైనా ఫోన్ చెయ్యాల్సిందే. అసలు రోజులో సగానికి పైగా ఫోన్తోనే గడిపేయడం వారి మనస్థితికి అర్థం పడుతుంది. ఇక బైక్ పై షికార్లు చేయడం, సినిమాలు, పార్కులు... ముద్దులు, హద్దులు దాటడమే వారి దృష్టిలో ప్రేమంటే. తల్లి తండ్రుల కంట పడకుండా తిరగడం ... అసలు వారిది నిజమైన ప్రేమ కాదనడానికి వారి చర్యలే నిదర్శనంగ చెప్పొచ్చు. అలాగని గుడ్డిగా విమర్శించడం కాదు కానీ... వారిలో ఎంత మంది ఆకర్షణ మైకం నుంచి భయట పడ్డారో చెప్పమంటే అప్పుడు తెలుస్తుంది. ఆకర్షణకు, ప్రేమకు మధ్య భేదం తెలవక పోవడమే గందరగోలానికి దారి తీస్తుంది. ఏది స్నేహమో, ఏది ఆకర్షనో తెలియని దుస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆకర్షననే ప్రేమగా భ్రమిస్తుంటారు. మీడియా, సినిమాలోనూ అలాంటి దృశ్యాలే చూపించడంతో యీ తీరు విస్తరించింది.
లవ్ ఎట్ ఫాస్ట్ సైట్..... వినడానికి అమృతంలా ఉంటుంది. ఈ వెర్రి పదాలనే పట్టుకుని ఎందఱో పక్కదారి పడుతున్నారు. మొదటి చూపులో ఉండే ఆకర్షననే ప్రేమగా భావించి వెంటపడి తిరగడం , అమ్మాయిలు కాదన్నా ఏడిపించడం మామూలైపాయింది. ఆకర్షణ ఉన్నంత మాత్రాన తర్వాత ప్రేమగా మారదు అని చెప్పలేము కానీ ఆ ఆకర్షణ మైకం నుంచి భయట పడితేనే అది సాధ్యం అవుతుంది. మొదట పరిచయం... క్రమంగా స్నేహం. ఇద్దరి ఆలోచనలు, భావాలు దగ్గర ఉంటే ప్రాణ స్నేహం... అక్కన్నుంచి ప్రేమగా మారే అవకాశం ఉంటుంది. ఇవేవి లేకుండా ప్రేమ అంటే అది గుడ్డిదే అవుతుంది.
నా మనసును నీకే అంకితం చేసాను మరొకరిని ప్రేమించడం సాధ్యం కాదు.... చాలా సినిమాల్లో చూసిన. అందరిని ఆకట్టుకునే డైలాగ్ ఇది. వాస్తవాన్ని పక్కన పెడితే అలాగే ఉంటుంది. మనసు అనేది ఆలోచన తో ముడిపడిన, మెదడుతో అనుసందానమైన ప్రక్రియ. మన మనసు ఎన్ని ఆలోచనలైన చేయ గలదు. అది మన ఆధీనం లోనే, మనదగ్గరే ఉంటుంది. ఆలోచన తీరును భట్టే మనసు ఉంటుంది. ఈ విషయం గుర్తించక పోవడం కూడా గందరగోలానికి దారి తీస్తుంది. మరో విషయం ఏమిటంటే. .. డైలాగులను పట్టుకుని వేలాడే వారు తాము తల్లి దండ్రులను,
కూడా ప్రేమించడం లేదా అని ప్రశ్నించుకోవాలి. అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు మరొకరిని ప్రేమించడానికి అవకాశం లేదని చెప్పడం లో అర్థం ఏముంటుంది. అయినా వారి మనసు అంతా ఇరుకుగా ఉంటుందా. తాము ప్రేమించే కుంటుంబ సభ్యులను వదిలి ఉండే వారు ప్రేమించిన వారిగా చెప్పుకునే వారిని వదిలి ఎందుకు ఉండలేరు. వారిది నిజమైన ప్రేమే అయితే లేని పోనీ అపోహలు ఎందుకు.
చివరగా చెప్పేది ఏమిటంటే ప్రేమ అనేది మనసుకు సమబందిచిందే అని ఏకిభవించే వారు ... ప్రేమలో రకాలు ఉండవనే విషయం గుర్తించాలి. ఎవరిని ప్రేమించిన ఒకేరకంగా ఉంటుంది. ఆకర్షణ, స్నేహం, ప్రేమ, ఆప్యాయత మద్య ఉండే క్రమానుగత భేదాల్ని గుర్తించాలి. ప్రేమ విశ్వ వ్యాప్తం. విశాలమైన మనసు ఉండాలే గాని ప్రపంచం మొత్తాన్ని ప్రేమించొచ్చు. అందరి ప్రేమ పొందవచ్చు. కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగొచ్చు.



No comments: